Thursday, October 12, 2017

చావుకీ రాయాలో వీలునామా

యుథెనేషియా, ఈ పదం వినగానే కొందరి గుండెల్లో ఝల్లుమనిపిస్తుంది. న్యాయపరంగా భారతదేశంలో, ప్రపంచంలో కూడా పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరుగుతున్న అంశం. మానవతా దృక్కోణంలో యుథెనేషియాను సమర్ధించేవారెంతమంది ఉంటే, వ్యతిరేకించే వారు అంతకు మించి ఉండి ఉండవచ్చు.
ఏమిటీ యుథెనేషియా? ఆక్స్‌ఫర్డ్ అడ్వాన్స్డ్ లర్నర్స్ నిఘంటువు ప్రకారం "the practice (illegal in most countries) of killing without pain a person who is suffering from a disease that cannot be cured" అంటే నయంకాని ప్రాణాంతక ముదురు రోగంతో బాధపడుతున్న వ్యక్తిని నొప్పి లేకుండా వైద్యకీయ విధానంలో చంపివేయడం. ఇది ఎన్నో దేశాల్లో చట్టవిరుద్ధం.
ఒక రకంగా యుథెనేషియాని గౌరవ మరణం, సుఖ మరణం, ముక్తి మరణం, ఇలా పలు విధాలుగా అభివర్ణించవచ్చు. 
మెర్సీ కిలింగ్ లేదా కరుణతో హత్య చేయడం ఈ యుథెనేషియాకున్న ప్రసిద్ధ పరిభాష.
ఈ యుథెనేషియా రెండు రకాలు - ఆక్టివ్ యుథెనేషియా, పాసివ్ యుథెనేషియా. ఆక్టివ్ యుథెనేషియాలో ప్రాణాంతక ఇంజెక్షన్ లేదా మందులు ఇచ్చి ప్రాణం తీసివేయడం జరుగుతుంది. పాసివ్ యుథెనేషియాలో చికిత్సను ఆపివేసి, ప్రాణాలను నిలిపి ఉంచే  మందులను ఇవ్వడం ఆపివేస్తారు.
ఇంకా రోగి ఇష్టపూర్వకంగా యుథెనేషియాకు అంగీకరిస్తే దానిని వాలంటారీ అని, రోగి అంగీకరించే పరిస్థితి లేనపుడు నాన్‌వాలంటరీ అని, రోగి అంగీకరణతో సంబంధం లేకుండా యుథెనేషియా చేస్తే దానిని ఇన్‌వాలంటరీ అని వ్యవహరిస్తున్నారు.
నెదెర్లాండ్స్, బెల్జియం, కొలంబియా, లగ్జెంబర్గ్ దేశాల్లో ఆక్టివ్ యుథెనేషియా చట్టబద్ధతను కలిగి ఉంది. స్విజర్లాండ్, జర్మనీ, జపాన్, కెనడా, అమెరికాలోని కొన్ని రాజ్యాల్లో ఆత్మహత్యకు వైద్య పరంగా సహకరించడం చట్టబద్ధమే.
భారతదేశంలో ఆక్టివ్ యుథెనేషియా చట్టవిరుద్ధం; పాసివ్ యుథెనేషియాను చట్టబద్ధం చేస్తూ ౨౦౧౧, ౭ మార్చి తేదీన సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
వాదనల రూపం నుండి పరిణితి చెంది ఈ యుథెనేషియా ఒక ప్రధాన ప్రశ్న రూపంలో సుప్రీం కోర్టు ముందుకొచ్చింది. ఆ ప్రశ్నే, "చట్టం జనాలు వ్రాసుకునే మరణ వీలునామాలను అంగీకరించాలా?" అన్నది.
ఈ వీలునామాను ఎవరైనా వ్యక్తి పూర్తి స్వస్థతలో ఉండగా రేపటి రోజు ఒక వేళ అతను/ఆమె చికిత్సకు ప్రతిక్రియ ఇవ్వలేని స్థితికి చేరుకుంటే, అలాంటి పరిస్థితిలో అతని/ఆమె ప్రాణాలను తీసివేయవచ్చు అని ముందుగా రాసివ్వటం.
ఈ ప్రశ్నకు చట్టపరమైన, మానవత, సైద్ధాంతిక, దార్శనిక పార్శ్వాలున్నాయి. ఈ ప్రశ్నకు జవాబిచ్చే ప్రక్రియలో సుప్రీం కోర్టు అత్యున్నత న్యాయస్థాన న్యాయవాదులు, న్యాయాధీశులు మనకు రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు(ధారణ 21) ప్రకారం జీవించే హక్కులోనే మరణించే హక్కు ఇమిడి ఉందా? అన్న ప్రశ్నను చట్టపరమైన కోణం నుంచి సమాధానమిస్తారు. ఇంతకు ముందు ఇచ్చిన తీర్పుల్లో మరణించే హక్కు జీవించే హక్కులో భాగం కాదని తెలిపిన సుప్రీం కోర్టు మరలా ఆ తీర్పు సారాంశాన్ని మార్చి చెప్పాల్సిన తరుణం వచ్చిందేమో?
"నేను ఎలా చావాలి, ఎప్పుడు చావాలి అన్నది నా చేతుల్లో లేదా?"
ఐతే ఈ మరణపు వీలునామా చికిత్సకు డబ్బు కట్టలేని పేద బంధువులకు ఉపశమనమే.
చనిపోతానని ఒక వ్యక్తి నిర్ణయించుకుంటే దాన్ని ప్రభుత్వం చట్టం ఇకపై ఆపలేవా?
ప్రాణాలని కాపాడటమే లక్ష్యంగా పని చేసే డాక్టర్లకు వారి ప్రతిజ్ఞకు విరుద్ధంగా పని చేయమని ఈ వీలునామాలు బలవంతపెడతాయి కదా!
అమెరికా చట్టాల ప్రకారం రోగి స్వాతంత్ర్యం పరమావధి. రోగి నిర్ణయం తీసుకోలేనపుడు, రోగి స్థానంలో రోగి కోసం నిర్ణయాలు తీసుకునే వారసులను చికిత్సకు ముందే తెలియపరచాలి. భారతదేశం కూడా ఇదే పంథా పాటించాలా?
తీర్పును రిజర్వ్ లో ఉంచి సుప్రీం కోర్టు ఎలాంటి సందేశం ఇస్తోంది? త్వరలో ఈ మరణ వీలునామాలపై సమగ్ర మార్గదర్శక సూత్రాలను వెలువరించనుందా? కాలమే చెప్పాలి.
ప్రభుత్వం మాత్రం ఈ మరణ వీలునామాలను ఏ మాత్రమూ సమర్ధించబోదని తెలుస్తోంది. ఇది ఒక విధంగా జనాల బతుకులను బలవంతంగా నాశనం చేయడమనేనన్నదని, రాజ్యాంగం ఉటంకించిన జీవన హక్కుకు ఇది విరుద్ధమని ప్రభుత్వ వాదన.
ముసలితనం వచ్చిన వెంటనే వృద్ధాశ్రమాలకు పంపించే మన జనాభా, వారికి రోగాలొస్తే బలవంతంగా మరణ వీలునామా వ్రాయించి చంపెయ్యరని ఏ విధంగా చెప్పగలం?
ఐతే ఒకవేళ మెడికల్ బోర్డ్, పై అధికారులు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి న్యాయాధికారుల నుండి అనుమతి పొందడాన్ని కచ్చితం చేస్తే యుథెనేషియాను దురుపయోగం కాకుండా ఆపవచ్చేమో.
సుప్రీం కోర్టు తీర్పు, మార్గదర్శకాల కోసం వేచి చూద్దాం.


No comments:

Post a Comment